You are currently viewing రాయలసీమ హక్కుల కోసం మేధావులు గళం విప్పాలి -బొజ్జా దశరథరామిరెడ్డి

రాయలసీమ హక్కుల కోసం మేధావులు గళం విప్పాలి -బొజ్జా దశరథరామిరెడ్డి

  • Post category:Nandyal

నిత్యం కరువుతో అలమటిస్తూ, త్రాగడానికి గుక్కెడు నీరులేక గొంతెండి పోతున్న రాయలసీమ ప్రజల దుస్థితిని చూసి అన్ని రంగాలలో వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధికి మేధావులు గళం విప్పాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి కోరారు. దశాబ్దాలుగా రాయలసీమ ప్రాంతం అన్ని రంగాలలోనూ వివక్షకు గురవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మే 31 న జరుగనున్న సిద్దేశ్వర జలదీక్ష సందర్భంగా నంద్యాల పట్టణంలో శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో పట్టణ పుర ప్రముఖులతో జలదీక్ష సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ మన అవగాహన లోపం వలననే 1951 వ సంవత్సరం లో కేంద్ర ప్రభుత్వం అనుమతించిన కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టును సిద్దేశ్వరం వద్ద నిర్మించకుండా నందికొండ వద్ద నాగార్జున సాగర్ ప్రాజెక్టును ప్రభుత్వాలు నిర్మించి రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశాయని దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం వేలాదిమంది రైతులు తమ భూములను త్యాగం చేసారని, రైతుల త్యాగాలను గుర్తించి వారి ఉన్నతికోసం, అభివృద్ధి కోసం పాటుపడవలసిన ప్రభుత్వాలు అప్పటి నుండి ఇప్పటి వరకు వారిని ఆదుకున్నది లేదని, శ్రీశైలం ప్రాజెక్టు కోసం తమ సర్వస్వం కోల్పోయిన వేలాదిమంది రైతులు ప్రస్తుతం దీనావస్థలో జీవనం సాగిస్తున్నారని దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా సాగు, త్రాగునీటిలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. 70 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రాయలసీమలో నిర్మాణంలో ఉన్న హంద్రీ – నీవా, గాలేరు- నగరి, తెలుగుగంగ, ముచ్చుమర్రి, గురురాఘవేంద్ర, సిద్దాపురం ఎత్తిపోతల పథకాలు మరియు ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అనుమతించిన ప్రాజెక్టులుగా పేర్కొనడం రాయలసీమకు ఒక వరం అని అన్నారు. కానీ రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఏర్పడిన కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ లో ఈ ఏడు ప్రాజెక్టులను అనుమతులు లేని ప్రాజెక్టులుగా పేర్కొనడం రాయలసీమకు తీవ్ర నష్టం కలుగ చేస్తుందని తెలిపారు. ఈ ఏడు ప్రాజెక్టులకు ఆరు నెలల కాలంలో అనుమతులు పొందకపోతే ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి అయినప్పటికీ వీటికి చుక్క నీరు కూడా విడుదల చేయమని కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ లో పేర్కొనడం బాధిస్తోందని అన్నారు. ఏడు దశాబ్దాల నిరీక్షణ తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు లభించే హక్కుకు కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డతుంటే దీనిని ప్రశ్నించాల్సిన రాజకీయ పార్టీలు గానీ, రాయలసీమ నాయకులు గానీ తమకు సంబంధంలేనట్లుగా వున్నారని ఆయన విమర్శించారు. అంతే కాకుండా శ్రీశైలం రిజర్వాయర్ లో కనీస నీటి మట్టం పై 60 టీ.ఎం.సీ. ల క్యారీ ఓవర్ రిజర్వుగా నిలువ ఉంచడానికి బచావత్ ట్రిబ్యునల్ చట్టం కూడా చేసింది. ఈ సంవత్సరం శ్రీశైలం రిజర్వాయర్ కు చేరవలసిన నీటి కంటే రెండంతలు అధనంగా కృష్ణా జలాలు వచ్చాయని, ఇలాంటి సంవత్సరంలో సంగమేశ్వరం గుడి పూర్తిగా నీటిలో మునిగి ఉండాలి. కాని శ్రీశైలం రిజర్వయర్ ను ఖాళీ చేసి రిజర్వాయర్ లో బురదను మిగిల్చి రాయలసీమ సమాజం పట్ల తమ వివక్షను పాలకులు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న తంతేనని, ఈ విషయంపై పాలకుల స్పంధన అంతంత మాత్రంగానే ఉందని, ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఇది ఒక అంశమే కాదని పేర్కొన్నారు. రాయలసీమ ఆంధ్రప్రదేశ్ లో ఒక భాగం అనే భావనే లేని నేపథ్యంలో సిద్దేశ్వర ఉద్యమం 2016 లో మొదలైందని వివరించారు. రాయలసీమ నాలుగు జిల్లాల నుండి నాలుగు ప్రధాన పార్టీలకు అధినేతలు ఉన్నా, రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై చోద్యం చూస్తూ మౌనంగా ఉండటంతో రాయలసీమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. రాయలసీమ పట్ల పాలకుల నిర్లక్ష్యాన్ని సభ్యసమాజం ముందుంచి, రాయలసీమ చట్టబద్ద నీటి హక్కుల సాధన లక్ష్యంగా మే 31, 2016 న వేలాది మంది రైతులు, ప్రజలు స్వచ్చందంగా సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన చేసారని గుర్తు చేశారు. సిద్దేశ్వరం అలుగు నిర్మించాల్సిన కృష్ణా నది ప్రాంతలో వంతెన నిర్మాణంతో కల్వకుర్తి నంద్యాల మద్యన నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణంను కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సందర్భంలో కూడా, అక్కడ వంతెనతో పాటు అలుగు కూడా నిర్మించాలని అడగలేని రాజకీయ వ్యవస్థ, పాలకులు, రాయలసీమ ప్రజా ప్రతినిధులు ఉండటం దురదృష్టకరం అని అన్నారు. ఈ సందర్భంగా సిద్దేశ్వరం అలుగు నిర్మాణ సాధ్యాసాధ్యాల అంచనాకై ఒక తెలంగాణ మరియు ఒక కోస్తాకు చెందిన సాంకేతిక నిపుణులతో ఏర్పాటు చేసిన ఇంజనీర్ ఇన్ చీఫ్స్ కమిటి (ఐదుగురు సభ్యలతో) 2011 లో ఈ ప్రాజెక్టు అవసరమని తెలుపుతూ, డిటైల్డ్ ప్రాజెక్టు నివేదికకు (డి పి ఆర్) నిధులు కేటాయించమని ప్రభుత్వానికి సిఫార్సు కూడా చేసిన విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొని పోతున్నామని వివరించారు. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అంటూ కృష్ణా నది పరీవాహక ప్రాంతం కాని విశాఖపట్నం లో కె.ఆర్.ఎం.బిని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపడం విడ్డూరంగా ఉందని అన్నారు. కృష్ణా నది నీటి పంపిణీలో కీలకంగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో వున్నందున కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. పై విషయాలపై రాయలసీమ సమాజానికి అవగాహణ లేకపోవడంతోనే రాయలసీమ భవిష్యత్తుకు కీలకమైన ఈ అంశాల పట్ల నిర్లక్ష్యంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి అని విమర్శించారు. రాయలసీమ సమాజం జాగృతి కావలసిన సమయం ఆసన్నమైంది అని పేర్కొన్నారు. రాయలసీమ సమాజం అవగాహనతో రాజకీయ వ్యవస్థను ప్రశ్నించడం మొదలు పెట్టకపోతే 70 సంవత్సరాల క్రితం సిద్దేశ్వర ప్రాజెక్టును పోగొట్టుకున్నట్లే, నేడు నిర్మాణం లో ఉన్న ఏడు ప్రాజెక్టులకు చుక్క నీరు అందకుండా పోయే ప్రమాదం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో నాలుగు జిల్లాలలో ప్రజలను జాగృతం చేసేందుకు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం, చట్టబద్ద నీటి హక్కుల కోసం, సిద్దేశ్వరం అలుగు నిర్మాణం కోసం గళం విప్పి ఉద్యమానికి అండగా నిలబడాలని దశరథరామిరెడ్డి కోరారు. సమావేశ తదనంతరం పట్టణ ప్రముఖులతో సిద్దేశ్వర జలదీక్ష గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో విద్యా సంస్థల అధిపతి డాక్టర్ రామకృష్ణా రెడ్డి, విశ్రాంత ఆంధ్ర బ్యాంక్ ఏ జి ఎం శివనాగి రెడ్డి,ప్రముఖ వైద్యులు మధుసూధన్ రావు, హరినాథరెడ్డి, పారిశ్రామికవేత్తలు ఆత్మకూరు రవీంద్రనాథ్, బొగ్గరపు నాగరాజు, నిచ్చెనమెట్ల శేషఫణి, జె.పి. వెంకటేశ్వరరావు, బి.జె.పి ప్రతినిధి, న్యాయవాది ఖాదరాబాద్ నరశింగరావు, పద్మశాలి సంఘం ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.