కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాల ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉచిత లలితకళల క్రీడల వేసవి శిక్షణ శిబిరాన్ని శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళారాధన ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐ.ఎమ్.ఏ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ,పురపాలక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అసదుల్లా, శిక్షణ శిబిరంలో శిక్షణ ఇస్తున్న కోచ్ లు పాల్గొన్నారు. కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ ఈ సంవత్సరం మే 5 వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు “కళా సాధన” వేసవి శిబిరం నిర్వహించడం జరుగుతున్నదని, ఈరోజు లాంఛనంగా ప్రారంభించామన్నారు. వేసవి సెలవులను బాలలు, యువత సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. కళలు, క్రీడలు బాలల మానసిక, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని తద్వారా చదువులో కూడా రాణించడానికి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ఈ శిక్షణ శిబిరంలో శాస్త్రీయ నృత్యం,ఆధునిక నృత్యం, శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం ,వాద్యసంగీతంలో గిటార్ ,కీబోర్డ్ ,మిమిక్రీ, వెంట్రిలాక్విజం, చిత్రలేఖనం, చక్కటి చేతివ్రాత ,హస్తకళలు, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, పద్య పఠనం, సంస్కృత శ్లోకాలు ,వేద గణితం, చదరంగం, కబడ్డీ ,కరాటే, టైక్వాండో, వ్యక్తిత్వ వికాసం వంటి శిక్షణ అంశాలలో 20 మంది కోచ్ లతో శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 4వ తేదీ టౌన్ హాల్ లో జరిగే ముగింపు ఉత్సవంలో శిక్షణ పొందిన బాలబాలికల చేత ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. శిబిరంలో పాల్గొన్న అందరికీ ప్రశంసా పత్రం అందజేస్తామన్నారు. శిబిరంలో శిక్షణ పొందడానికి, మగింపు వుత్సవంలో ప్రదర్శనలు ఇవ్వడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరంలేదని తెలిపారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఈ శిబిరాలు నిర్వహించలేక పోయామని, తిరిగి ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నామని అన్నారు. పురపాలక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అసదుల్లా మాట్లాడుతూ ఇటువంటి చక్కటి కార్యక్రమానికి పురపాలక పాఠశాల వేదిక కావడం సంతోషకరమన్నారు. పిల్లలకు క్రీడల ద్వారా మానసిక, వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని,తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఈ సమావేశంలో యువజన విభాగం అధ్యక్షుడు, శిక్షణ శిబిరం సమన్వయకర్త రంగనాథ్, కోచ్ లు కళ్యాణి, లలితా సరస్వతి, సుహాసిని, రజాక్, వెంకటేష్ బాబు, సుదర్శనం, బాలకృష్ణ, నాగేంద్ర, ఇలియజర్, రామ సుబ్బయ్య, పుల్లయ్య, రాజేంద్ర, రత్నాకర్, బాబురావు గణేష్, సతీష్ ,మధు,మజీద్, ప్రియ చందన , శిక్షణ పొందుతున్న 300 మంది బాలబాలికలు యువత,పిల్లల తల్లితండ్రులు పాల్గొన్నారు.

ఉచిత లలిత కళల, క్రీడల శిక్షణా శిబిరం ప్రారంభం
- Post published:May 14, 2022
- Post category:Nandyal