You are currently viewing పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించండి

పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించండి

  • Post category:Nandyal

-జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్

అంగన్ వాడీ కేంద్రాల సెక్టార్ పరిధిలో బరువు తక్కువ ఉన్న పిల్లలు, పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి పిల్లలను సంపూర్ణ ఆరోగ్యవంతులు చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకొని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ సిడిపిఓలు, అంగన్ వాడి సూపర్వైజర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని నియోజకవర్గాల సిడిపిఓలు, అంగన్ వాడి సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ అంగన్ వాడీ కేంద్రాల సూపర్వైజర్లు తమ పరిధిలోని అంగన్వాడి కేంద్రాలను సరైన రీతిలో పర్యవేక్షించడం లేదని స్థానికులు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారన్నారు. ఐసిడిఎస్ నిర్దేశించిన డేటా ప్రకారం ప్రతి అంగన్వాడీ కేంద్ర పరిధిలో బరువు తక్కువ పిల్లలు, పోషకాహార లోపం ఉన్న పిల్లలు ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. పిల్లలకు పోషకాహారం అందించడంలో విఫలం కావడం వల్లే పిల్లలు బరువు, ఎత్తు తక్కువగా వుంటున్నారన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రతి అంగన్వాడీ కేంద్ర సెక్టార్ పరిధిలో బరువు, ఎత్తు తక్కువగా ఉన్న పిల్లలను గుర్తించి… పోషకాహారం అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అంగన్వాడి సూపర్వైజర్ లను కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయంపై తల్లిదండ్రులకు కూడా పిల్లలకు ఇచ్చే పోషకాహార విలువలపై సంపూర్ణ అవగాహన కల్పించి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. చెక్ లిస్ట్ ఏర్పాటు చేసుకొని ఆ మేరకు పిల్లలకు పోషకాహారం అందించి ప్రతి వారం బరువు, ఎత్తులను పర్యవేక్షించాలన్నారు. పిల్లల్లో ఆరోగ్య లోపాలు ఉన్నట్లయితే సమీపంలోని వైద్య ఆరోగ్య కేంద్రాలలో వైద్య చికిత్సలు అందించాలని కలెక్టర్ సూచించారు. పోషక విలువలు తక్కువుగా వున్న పిల్లలను వారం వారం పర్యవేక్షించి బరువు, ఎత్తు పెరగకపోతే న్యూట్రిషన్ లోపమా, తల్లిదండ్రుల నిర్లక్ష్యమా, ఆరోగ్య లోపామా తదితరాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పోషకాహారం అందిస్తున్న ప్రతి చైల్డ్ పైన ప్రత్యేక దృష్టి సారించి ప్రయత్న లోపం లేకుండా నిరంతరాయంగా పర్యవేక్షించాలన్నారు. సిడిపిఓలు అంగన్వాడీ సూపర్వైజర్లు వారంలో నాలుగు రోజుల పాటు క్షేత్రస్థాయిలో ఉండి అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయడంతోపాటు పిల్లల ఎదుగుదలపై అందరి సహకారం తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఉండి విధులు నిర్వహిస్తే ఖచ్చితమైన ప్రగతి కనబడుతుందన్నారు. పోషక విలువలు, రక్తహీనతపై తల్లిదండ్రులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సూక్ష్మస్థాయిలో స్పష్టమైన అవగాహన కల్పించాలని సూపర్వైజర్ లను కలెక్టర్ ఆదేశించారు. పోషకాహార విలువలపై చీఫ్ సెక్రెటరీ నెలకోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివరాలు సేకరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ ప్రణాళికను ఇవ్వాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు.