You are currently viewing ఆర్టీసీ ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి

ఆర్టీసీ ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి

  • Post category:Nandyal

-జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్

ప్రయాణికులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సురక్షితంగా చేరవేయడంలో ఆర్టీసీ డ్రైవర్ల పాత్ర కీలకమైందని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ పేర్కొన్నారు. బుధవారం ఆర్టీసీ బస్టాండ్ లోని డిపో గ్యారేజ్ లో ఇంధన పొదుపు ఉత్సవాలలో ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కడప ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, డిపో మేనేజర్ సర్ధార్ హుస్సేన్, డిప్యూటీ సీఎంఈలు రజియా సుల్తానా, భాస్కర్ లు, అసిస్టెంట్ మేనేజర్ మద్దిలేటినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రయాణీకులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేయడంలో ఆర్టీసీ డ్రైవర్లు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. డ్రైవర్లు క్షేమంగా డ్రైవ్ చేస్తేనే వాహనంలోని ప్రయాణీకులు సురక్షితంగా వుండడంతో పాటు డ్రైవర్లకు సంబంధించిన వారి కుటుంబాలు కూడా క్షేమంగా ఉంటాయని ఈ విషయాన్ని డ్రైవర్లందరూ దృష్టిలో ఉంచుకొని ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండి ప్రయాణికులను సురక్షిత సర్వీసులు అందించడంతోపాటు తమను తాము సంరక్షించుకోవాలని కలెక్టర్ తెలిపారు. వేగం కన్నా ప్రాణం మిన్నగా భావించి వాహన డ్రైవర్లు వేగ పరిమితికి లోబడి డ్రైవ్ చేస్తే ఆటోమేటిక్ గా సేఫ్ జోన్ లో వుంటారని కలెక్టర్ తెలిపారు. అలాగే నిర్ణీత వేగంతో వాహనాలు నడపడం వల్ల ఇంధనం కూడా పొదుపు ఆవుతుందని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా సంబంధిత ప్రతిపాదనలు డిపో మేనేజర్ ద్వారా తమకు సమర్పిస్తే ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ తెలిపారు. కడప ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, డిపో మేనేజర్ సర్ధార్ హుస్సేన్, డిప్యూటీ సీఎంఈలు రజియా సుల్తానాలు డ్రైవర్లకు ఇంధన పొదుపుకు సంబంధించి పలు అంశాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఆర్టీసీ బస్సులను ఇంధనం పొదుపుగా వాడటం తో పాటు ప్రయాణికులను గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చిన 14 మంది ఉత్తమ డ్రైవర్లను శాలువాతో సత్కరించి మెమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందించారు. అంతకుముందు డిపో గ్యారేజ్ ఆవరణలో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు.